ప్రముఖ అంతర్జాతీయ టెక్ సంస్థ ఐబీఎం తన కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ ఉద్యోగాలకు హెచ్1బీ వీసా మరియు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ షిప్ ను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులు అమెరికా నుంచి మరో దేశానికి బదిలీ కావడం లేదా కంపెనీని విడిచిపెట్టడం అనే రెండు మార్గాలలో ఏదో ఒకటి ఎంచుకోవాలని సంస్థ సూచించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగులకు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా లక్షా 50 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో ఈ నిర్ణయం అమలు కానుంది. అమెరికా టెక్ రంగంలో భారతీయ నిపుణుల సంఖ్య గణనీయంగా ఉండటంతో పాటు హెచ్1బీ వీసాలు మరియు గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగులలో ఈ ప్రకటన తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.

