ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలని మరియు ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రభుత్వాలు లేదా వ్యవస్థలను ప్రశ్నించే హక్కు లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవం రోజే ఎన్నికల పోలింగ్ జరగడం ఒక ప్రత్యేక సందర్భమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ సమానంగా ఓటు హక్కును ప్రసాదించిందని గుర్తు చేశారు. అంబేద్కర్ చెప్పినట్లుగా ఓటు అనేది ఒక శక్తివంతమైన ఆయుధమని ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

