దేశంలోని కోళ్ల పరిశ్రమను బర్డ్ ఫ్లూ ముప్పు నుంచి రక్షించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హెచ్5ఎన్1 వ్యాక్సిన్ ను నవంబర్ 20వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నూతన టీకాను జాతికి అంకితం చేయనున్నారు. భోపాల్ నగరంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు దేశీయంగా కోళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న హెచ్5ఎన్1 క్లేడ్ 2.3.2.1a వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకునేలా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు.
గతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు 2006 నుంచి ఇప్పటివరకు 500కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ స్వదేశీ టీకా అందుబాటులోకి రావడం ద్వారా పౌల్ట్రీ రంగం మరియు కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతుల జీవనోపాధికి పూర్తి భరోసా లభించనుంది. కేవలం పక్షులకే కాకుండా జంతువులు మరియు మనుషులకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున వైరస్ ను ప్రాథమిక దశలోనే నివారించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించనుంది.

