తెలంగాణలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ముంబైలో సమావేశమై ప్రాజెక్టుపై చర్చించింది. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిపై నిర్మించనున్న బ్యారేజీ ఎత్తు పెంపు నీటి లభ్యత ముంపు సమస్యలు పరిహారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. గతంలో 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తును కోరుతోంది. ఈ ఎత్తుతో ప్రాజెక్టు చేపడితే సాగునీరు తాగునీటి అవసరాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలంగాణ అధికారులు వివరించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు అక్కడి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటు గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించినప్పటికీ తుది నిర్ణయానికి ముందు సాంకేతిక పర్యావరణ పరిపాలనాపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. బ్యారేజీ ఎత్తు నీటి లభ్యత ముంపు ప్రాంతాలు భూసేకరణ పరిహారం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర జల సంఘం పరిధిలోనూ అవసరమైన సాంకేతిక పరిశీలనలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర సమన్వయంతో ప్రత్యామ్నాయాలను పరిశీలించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ సమావేశంతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చర్చలు మరో దశకు చేరినప్పటికీ బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు సంబంధించి తుది అనుమతులు ఇంకా రావాల్సి ఉంది.

