అక్రమ మద్యం వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. అనంతరం ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. అధికారుల నోటీసుల మేరకు విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. గత ప్రభుత్వం కాలంలో అమలైన మద్యం విధానం, మద్యం అమ్మకాల విధానం, నిధుల వినియోగం, జరిగిన లావాదేవీలు, ఇందులో ఎవరి పాత్ర ఉందన్న అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం వ్యాపారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, డబ్బు ఎటు వెళ్లింది, ఏ విధంగా వ్యవస్థ నడిచింది అనే కోణంలో ప్రశ్నలు సాగినట్లు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానాలు ఇచ్చారని, ఈ సందర్భంగా ఆయన స్టేట్మెంట్‌ను కూడా రికార్డు చేసినట్లు తెలిసింది. దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిన ఈ విచారణతో ఏపీ మద్యం కేసు దర్యాప్తు మరో కీలక దశకు చేరిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో తదుపరి చర్యలు ఏవుంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

