సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు ఈ లేఖను హరీశ్‌రావు మీడియా సాక్షిగా విడుదల చేశారు. లేఖలో సింగరేణి కాలరీస్ కంపెనీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను వివరించారు. 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణిలో టెండర్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. టెండర్లలో పాల్గొనాలంటే తప్పనిసరిగా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉండాలనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టారని తెలిపారు. ఇలాంటి విధానం సింగరేణి చరిత్రలో గతంలో ఎప్పుడూ లేదని, కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ నిబంధనను అనుసరించడం లేదని స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధన పేరుతో కొందరు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే లాభం చేకూర్చేలా టెండర్లు కట్టబెడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనస్ 7 శాతం నుంచి మైనస్ 20 శాతం వరకు తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి, ఇప్పుడు ప్లస్ 7 శాతం నుంచి ప్లస్ 10 శాతం వరకు అధిక ధరలకు కొత్త కాంట్రాక్టులు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాల వల్ల సింగరేణికి వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

