ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీ బలయ్యారనే ఆరోపణలు కడపలో కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ జిల్లా కడప నగరం 27/2 గౌస్ నగర్ సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్న జి. విజయకుమారి (42) అకస్మాత్తుగా మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈ నెల 17న మధ్యాహ్నం పాత కడప యూపీహెచ్‌సీలో విజయకుమారి విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉన్నతాధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, సర్వేలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ గట్టిగా మాట్లాడారని సమాచారం. పై నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వేలు పూర్తి చేయాల్సిందేనని అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చాయని చెబుతున్నారు. పండుగ సమయమైనప్పటికీ విధుల్లో ఉన్న విజయకుమారి, అధికారుల తీరుతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆమెకు ఇప్పటికే శ్వాస సంబంధిత సమస్యలు ఉండటంతో ఇంటికి వచ్చిన తర్వాత తలనొప్పిగా ఉందని, మోషన్స్ అవుతున్నాయని కుమార్తెకు చెప్పినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఊపిరి ఆడడం లేదని చెప్పుతూ ఒక్కసారిగా కళ్లు మూసుకుని కుప్పకూలిపోయిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. విజయకుమారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తమ తల్లి మృతికి అధికారుల ఒత్తిళ్లే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

