ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలని ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మొంథా’ తుఫాను తీవ్ర నష్టం కలిగించినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరైన సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు వ్యవస్థ నిర్వీర్యం కావడంతో దళారుల ఆట కొనసాగుతోందని, వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, అరటి, మామిడి వంటి పంటలకు మద్దతు ధర కుంటుపడటంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పంట బీమా, ఇ-క్రాప్ రిజిస్ట్రేషన్ రద్దు, ఇన్‌పుట్ సబ్సిడీలు ఆగిపోవడం వంటి విషయాలను పార్లమెంట్‌లో లేవనెత్తి అత్యవసర సహాయ నిధులు, ఎంఎస్‌పీకి చట్టబద్ధ హామీ కోసం ఒత్తిడి తేవాలని సూచించారు. అలాగే 18.63 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డుల రద్దు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాలని, రాష్ట్ర హక్కుల కోసం గట్టి పోరుకు సిద్ధంగా ఉండాలని ఎంపీలకు పిలుపునిచ్చారు.

