దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. స్వచ్ఛమైన గాలి లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనం చేపట్టినా ఫలితం లేకపోయింది. వాతావరణం మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో వందలాది మంది నగరవాసులు ఇండియా గేట్ వద్ద రోడ్డెక్కి నిరసన తెలిపారు. తక్షణ పరిష్కారం కోరారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 400కు మించి నమోదైంది. ప్రజలు శ్వాస తీసుకోవడంలోనే ఇబ్బంది పడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నాయకులు కలిసి కార్యకర్తలు, నిరసనకారులతో ఇండియా గేట్ వైపు కవాతు నిర్వహించారు. వాయు కాలుష్యాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.

