హరియాణాలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మీడియా సమావేశంలో బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ ఫొటోను చూపించి, ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ ఆరోపించారు. దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ మోడల్ పేరు లారిసా నెరీ. ఈ విషయంపై ఆమె తాజాగా స్పందిస్తూ, అది తన పాత ఫొటో అని, 18-20 ఏళ్ల వయసులో తీసుకున్నదని చెప్పారు. స్టాక్ ఇమేజ్ సైట్ నుంచి ఆ ఫొటోను కొనుగోలు చేసి ఉపయోగించి ఉంటారని అన్నారు. తనను భారతీయురాలిగా చూపి స్కామ్‌లో భాగం చేయడం పిచ్చితనమని విమర్శించారు. భారత రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తాను బ్రెజిల్‌కు చెందిన డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌నని తెలిపారు. ఈ వార్తలు చూసి షాక్ అయ్యానని, చాలామంది ఫోన్లు, ఇంటర్వ్యూలు అడుగుతున్నారని చెప్పారు. ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబేర్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. గత ఏడాది హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయంటూ రాహుల్ ఆరోపించారు. ఆమె ఫొటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించినా ఎన్నికల సంఘం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.

