మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. కృష్ణా జిల్లాలో తుఫాన్ బాధిత రైతులను కలిసిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంట నష్టాలపై విచారణ చేశారు. ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందిందని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే గ్రామాల్లోకి వెళ్లి చూడాలని అన్నారు. ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. గోదావరి జిల్లాల నుంచి కర్నూల్ వరకు తుఫాన్ ప్రభావం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంట పొలాలు మునిగిపోయాయని, తీవ్ర గాలులకు పంటలు నాశనమయ్యాయని చెప్పారు. రైతుల శ్రమ మొత్తం వృథా అయిందని, పత్తి, మొక్కజొన్న, బత్తాయి పంటలు నాలుగు లక్షల ఎకరాల్లో నష్టపోయాయని వివరించారు. 18 నెలల చంద్రబాబు పాలనలో 16 సార్లు ప్రకృతి విపత్తులు జరిగాయని, ఒక్క రైతుకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లేదా పెట్టుబడి సాయం అందలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల వెన్ను విరిచిందని, ఉచిత పంటల బీమా కూడా లేదని ఆరోపించారు. రైతులు వేల నుంచి లక్షల్లో నష్టపోయారని, ఎరువులు బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సి వచ్చిందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. వైసీపీ పాలనలో రైతులకు అండగా నిలిచామని, ఎవరూ భయపడలేదని, అన్న ఉన్నాడనే ధైర్యం ఉండేదని గుర్తుచేశారు. డబ్బులు వచ్చేవని, సీఎం యాప్ ద్వారా అన్నీ అందుబాటులో ఉండేవని చెప్పారు. ఆర్‌బీకేలు, సచివాలయాల అనుసంధానంతో క్రాప్ బుకింగ్ జరిగేదని, నష్టపరిహారం అందేదని, ప్రభుత్వం రైతులకోసమే ఉందనే భరోసా లభించేదని వివరించారు. మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెట్‌లో పోటీ సృష్టించి ధరలు స్థిరపరిచామని, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని మాజీ సీఎం జగన్ తెలిపారు.

