ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు, జోనల్ ఇంఛార్జులను కూడా నియమించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ఆయన ఆదేశించారు. తీవ్రత మరింత పెరిగితే రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సూచించారు. పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో, ఆ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం) 10వ బెటాలియన్ బలగాలు తుఫాన్ ప్రభావిత జిల్లాలకు శనివారం రాత్రి బయలుదేరాయి. 30 మంది సిబ్బందితో కూడిన ఆరు బృందాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చేరుకున్నాయి. ఈ బృందాలకు బెటాలియన్ కమాండెంట్ ప్రసన్నకుమార్ అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేస్తూ, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తోంది.

