అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి ప్రథమ బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడలో రాష్ట్ర అటవీ శాఖ అధికారుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన, పర్యావరణ, అటవీ శాఖలను తాను స్వయంగా ఎంచుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం కేవలం 22% ఉందని, దీన్ని 2047 నాటికి 50%కి పెంచే లక్ష్యంతో కృషి చేయాలని అధికారులకు, నిపుణులకు సూచించారు. అటవీ శాఖలో సిబ్బంది కొరతను గుర్తించినట్లు చెప్పిన పవన్, ఈ సమస్యను కేబినెట్‌లో చర్చించినట్లు వెల్లడించారు. ఫ్రంట్‌లైన్ అటవీ సిబ్బంది కష్టతర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, వారి భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అటవీ సిబ్బంది సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో రూ.5 కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరప్రాంత సంరక్షణ కోసం ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో సముద్ర కోతను అరికట్టడంలో సహాయపడుతుందని వివరించారు. కొత్త సిబ్బంది నియామకాల్లో సిఫార్సులకు తావులేదని స్పష్టం చేశారు.

