టీడీపీ కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం దందా విజృంభిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్ జగన్ పాలనలో బెల్ట్ షాపులు లేవు. నిబంధనల ప్రకారం ప్రభుత్వమే మద్యం విక్రయాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నకిలీ మద్యం విజృంభిస్తోంది. కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ వారంతా టీడీపీ నేతలే. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు,” అని మండిపడ్డారు. “నకిలీ లిక్కర్ కుటీర పరిశ్రమను చంద్రబాబు రాష్ట్రమంతా నడిపిస్తున్నారు. లక్షలాది బెల్ట్ షాపులు టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. కల్తీ మద్యం అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలి,” అని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ను ఈ కేసులో ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని, చంద్రబాబు, లోకేష్ జోగి రమేష్ ఛాలెంజ్‌ను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. “చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అన్యాయం, అరాచక పాలన సాగుతోంది,” అని విమర్శించారు.