స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ డిమాండ్‌తో బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించాయి. తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించగా, అధ్యక్షురాలు కవిత, ఆమె కుమారుడు ఆదిత్య ఖైరతాబాద్ చౌరస్తాలో మానవ హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. “ప్రతి ఇంటి నుంచి పోరాటం రావాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు అవసరం,” అని ఆదిత్య ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేశారు. కవితను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఎమ్మెల్సీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆదిత్య బంద్‌లో పాల్గొనడం గమనార్హం. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బంద్‌లో పాల్గొని, “తమిళనాడు నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసింది. తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు నిజాయితీ లేకుండా మోసం చేస్తున్నాయి. 52% బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి,” అని డిమాండ్ చేశారు.