పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, అఫ్గాన్ భారత్ తరఫున పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇది ఎక్కువ కాలం కొనసాగదని ఆసిఫ్ సందేహం వ్యక్తం చేశారు. అఫ్గాన్ నిర్ణయాలు కాబుల్‌లో కాకుండా న్యూదిల్లీలో తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్‌లో పర్యటించడంపై కూడా ఆసిఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.