ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హమాస్ ఈ రోజు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ బయలుదేరారు. విమానంలో బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలో ఇక నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ ఇజ్రాయెల్ చేరుకుని మొదట పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బందీల కుటుంబ సభ్యులతో సమావేశమై, అక్కడి నుంచి ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగే శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాల కార్యక్రమం నిర్వహించనున్నారు.
2023 అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని హతమార్చి, 251 మందిని బందీలుగా తీసుకున్నారు. వీరిలో కొంతమందిని హమాస్ విడుదల చేయగా, మరికొంతమందిని ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి. ప్రస్తుతం హమాస్ వద్ద 48 మంది బందీలు ఉన్నారు, వీరిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు సమాచారం. ఈ బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను సోమవారం సాయంత్రం విడుదల చేయనుంది. రెండేళ్ల తర్వాత బందీల విడుదలతో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఈ ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమైన ముందడుగుగా పరిగణించబడుతోంది.