పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన ఆమెను ఐదుగురు నిందితులు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. రాత్రి సమయంలో అమ్మాయిలు బయటకు రావద్దని, తమను తాము రక్షించుకోవాలని ఆమె సూచించారు. ఈ ఘటనలో తన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం సరికాదని, విద్యార్థిని భద్రతా బాధ్యత కాలేజీదేనని మమతా అన్నారు. “ముఖ్యంగా రాత్రి పూట ఆడపిల్లలను బయటకు అనుమతించకూడదు. ఇది షాకింగ్ ఘటనే, కానీ నిందితులను వదిలేది లేదు” అని ఆమె పేర్కొన్నారు.
అర్థరాత్రి 12.30 గంటలకు విద్యార్థిని క్యాంపస్ నుంచి ఎలా బయటకు వచ్చిందని మమతా ప్రశ్నించారు. తన ప్రభుత్వాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఇలాంటి గ్యాంగ్‌రేప్ ఘటన జరిగిందని, అక్కడి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని ఆమె ప్రతిప్రశ్న వేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి, మహిళల భద్రతపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తాయి.