వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోకు ప్రజాస్వామ్య హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం అందరినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. మరియా కొరీనా రాజ్యాంగ హక్కుల కోసం చేసిన పోరాటాన్ని భారత విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న కృషితో పోల్చారు. రాహుల్ గాంధీకి కూడా నోబెల్ శాంతి బహుమతి రావాలని ఆకాంక్షిస్తూ, వారిద్దరి ఫొటోలను షేర్ చేసిన ఈ పోస్టు నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. నోబెల్ కమిటీ ప్రకారం, వెనెజువెలాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య సాధన కోసం మరియా కొరీనా మచాదో చేసిన విశేష కృషి ఈ పురస్కారానికి కారణం. ఆమె ఎన్నో బెదిరింపులను ఎదుర్కొని, గత ఏడాదిగా అజ్ఞాతంలో జీవించినప్పటికీ, వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా, ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. ఆమె శాంతియుత పోరాటం అనేకమందికి స్ఫూర్తిగా నిలిచిందని కమిటీ పేర్కొంది. సురేంద్ర రాజ్‌పుత్ పోస్టు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు రాహుల్ గాంధీ రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని సమర్థిస్తూ మద్దతు తెలిపగా, మరికొందరు ఈ పోలికపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన భారత రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారింది.