తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రకటనలు, బాండ్లలో చెప్పిన వాగ్దానాలను ఎగ్గొడుతూ అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నేర్పరితనం చూపిస్తున్నారని విమర్శించారు. అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో నిర్వహించిన సభను బలవంతపు సంబరాలుగా అభివర్ణించారు.యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3,000, రైతులకు రూ.20,000 పెట్టుబడి సాయం, మహిళలకు రూ.1,500 నెలవారీ ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 50 ఏళ్ల వయసులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రూ.4,000 పెన్షన్ వంటి హామీలు నెరవేర్చలేదని జగన్ ఎత్తిచూపారు. ఈనాడు పత్రికలో ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇచ్చిన ప్రకటనల మధ్య తేడాలను సాక్ష్యాలతో వివరించారు.చంద్రబాబు పాలనలో ఇసుక, మద్యం మాఫియా దోపిడీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ రద్దు, రైతులకు ఎరువుల కొరత, గిట్టుబాటు ధర లేకపోవడం, ఉచిత పంటల బీమా ఎగ్గొట్టడం వంటి వైఫల్యాలను జగన్ గుర్తు చేశారు. 15 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేసినా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, ఈ నిధులు చంద్రబాబు అనుయాయుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్న సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు.