ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పెద్ద సభను నిర్వహించనుంది. అనంతపురం వేదికగా ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నేడు బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ఎన్డీయే కీలక నేతలు హాజరు కానున్నారు. త్రిపక్ష కూటమికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభకు 3 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా.
ప్రజల రాకపోకల కోసం ప్రైవేట్, ఆర్టీసీ కలిపి 3,857 బస్సులు కేటాయించారు. సభ నిర్వహణ కోసం 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దారిమళ్లింపులు చేపట్టారు. హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో వాహనాలను ఇతర దారులకు మళ్లించారు. భద్రత కోసం ఇప్పటికే ఉన్న 400 సీసీ కెమెరాలతో పాటు కొత్తగా మరో 250 కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ సభలో ఎన్డీయే కూటమి తమ శక్తిని ప్రజలకు చూపించేందుకు విశేషంగా యత్నిస్తోంది.