ఫ్రాన్స్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. రక్షణ మంత్రిగా ఉన్న సెబాస్టియన్ లెకోర్నును దేశ కొత్త ప్రధానిగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఫ్రాంకోయిస్ బేరో ఓడిపోవడంతో, ఆయన రాజీనామా చేశారు. ఆ వెంటనే మాక్రాన్ కొత్త నాయకుడిగా లెకోర్నును ఎంపిక చేశారు. ఇప్పటి ప్రభుత్వంలో ఇది మూడో మార్పు కావడం గమనార్హం. 39 ఏళ్ల వయసులో రక్షణ మంత్రిగా వ్యవహరించిన లెకోర్నుకు సంక్షోభ పరిస్థితుల్లో పాలనాపరంగా అనుభవం ఉంది. అందుకే దేశాన్ని గట్టెక్కించగలడని భావించిన మాక్రాన్, ప్రధానిగా అవకాశం ఇచ్చారు. ఫ్రాన్స్ ప్రస్తుతం ఆర్థికంగా బలహీనంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విభజించబడిన పార్లమెంట్‌ను ఏకతాటిపైకి తీసుకురావడం, 2026 బడ్జెట్‌ను ఆమోదించడం వంటి కీలక సవాళ్లు లెకోర్ను ఎదుట నిలబడ్డాయి. అంతర్జాతీయంగా ఫ్రాన్స్‌కి ఉన్న ఒత్తిడులను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రెండేళ్లలో రెండు ప్రధానులు మారిన పరిస్థితిలో, సెబాస్టియన్ లెకోర్ను నాయకత్వంపై ప్రజలు, రాజకీయవర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ముందున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే దేశానికి మేలు జరగనుంది. లేదంటే మళ్లీ అధికారం మారే పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.