అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించడం ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నిర్ణయంతో పాటు భారత్, రష్యా సన్నిహితత, చైనాతో మెరుగవుతున్న సంబంధాలు అమెరికా రాజకీయవర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ట్రంప్ మద్దతుదారులైన రైట్ వింగ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయ ఉద్యోగులు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ, ప్రత్యేకంగా ‘‘కాల్ సెంటర్లు’’పై దాడి చేస్తున్నారు. ప్రముఖ వ్యాఖ్యాత లారా ఇంగ్రహమ్ తన ఎక్స్ పోస్టులో ‘‘భారత్‌తో ఒప్పందం అంటే మరిన్ని వీసాలు ఇవ్వాల్సిందే. మాకు వీసాలు, ట్రేడ్ డెఫిషిట్ అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ అనుచరుడు చార్లీ కిర్క్ కూడా ‘‘భారతీయుల వల్లే అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇకపై స్థానిక ప్రజలకే ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు. మరొక రైట్ వింగ్ వ్యాఖ్యాత జాక్ పోసోబియెక్ ‘‘కాల్ సెంటర్లపై 100 శాతం టారిఫ్స్ వేయాలి. విదేశీ రిమోట్ ఉద్యోగాలకు కూడా సుంకాలు విధించాలి’’ అంటూ మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారతీయ అమెరికన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ట్రంప్, రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇది అసూయ తప్ప మరొకటి కాదు. భారతీయులు కష్టపడి సాధించిన విజయాన్ని పోటీగా చూస్తున్నారు’’ అని పత్రికా రచయిత బిల్లీ బినియన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల్లో 75 శాతం మంది భారతీయులే ఉండగా, 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ విధానాలు, రైట్-వింగ్ వర్గాల వ్యాఖ్యలు వలస భారతీయుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.