ఉత్తర బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ వాతావరణ మార్పు ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అదే రోజున పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు అత్యధిక వర్షాలను ఎదుర్కొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉద్రిక్తమైన సముద్ర పరిస్థితుల దృష్ట్యా, శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిశాయి, విజయనగరం జిల్లా గుర్లలో 76.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై అత్యధికంగా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్రం మొత్తంలో సాధారణం కంటే గణనీయంగా ఎక్కువ వర్షాలు కురిశాయి. ఐఎండీ గణాంకాల ప్రకారం సగటు వర్షపాతం 200.9 మిల్లీమీటర్లు కాగా, సాధారణ వర్షపాతం144.3 మిల్లీమీటర్లు. శ్రీ సత్యసాయి 143 శాతం అధిక వర్షపాతం, చిత్తూరులో 123 శాతం అధికం, అనకాపల్లిలో 112 శాతం అధికం, అనంతపురంలో 110 శాతం అధికం, విశాఖపట్నంలో 100 శాతం అధిక వర్షాపాతం నమోదైంది. గత నెలలో అధిక వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు జారీ చేశారు.