ప్రసిద్ధ నిర్మాత, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అల్లు కనకరత్నం (94) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె ఆరోగ్యం గత కొద్దిరోజులుగా బలహీనంగా మారినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లూ కనకరత్నం, తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు అల్లు రామలింగయ్య సతీమణి. కుటుంబ పెద్దగా అందరినీ ఆప్యాయంగా కాపాడుతూ కుటుంబ బంధాలను నిలబెట్టిన వ్యక్తిగా ఆమె పేరుగాంచారు. ఆమె మృతి అల్లు కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. తల్లి మృతివార్త తెలిసిన వెంటనే మనవడు, సినీ నటుడు అల్లు అర్జున్ ముంబై నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు అల్లు నివాసానికి చేరుకుని సంతాపం తెలియజేస్తున్నారు. అల్లూ కనకరత్నం అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.