అగ్రరాజ్యం అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్‌లో 36 ఏళ్ల సిక్కు యువకుడు గురుప్రీత్ సింగ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. జూలై 13న జరిగిన ఈ ఘటనపై తాజాగా లాస్ ఏంజిల్స్ పోలీసులు వివరాలు వెల్లడించారు. క్రిప్టో.కామ్ అరీనా సమీపంలోని రద్దీ ప్రాంతంలో సింగ్ గొడ్డలితో తిరుగుతున్నాడని, పాదచారులను బెదిరిస్తున్నాడని స్థానికులు 911కు అనేక కాల్స్ చేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని తన ఆయుధాన్ని వదిలేయమని పలుమార్లు హెచ్చరించారు. అయితే ఆయన మాట వినకపోవడంతో పాటు, పారిపోవడానికి ప్రయత్నించి, ఒక సీసా విసిరినట్లు తెలిపారు. తర్వాత వాహనంతో పరారయ్యే క్రమంలో ఒక పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడు. చివరికి ఫిగ్యురోవా 12వ వీధి వద్ద ఆగిన సింగ్, పోలీసులపై కత్తితో దాడి చేయడానికి యత్నించగా, కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి సుమారు రెండు అడుగుల పొడవు ఉందని తెలిపారు. తీవ్ర గాయాలతో సింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.