జమ్మూకాశ్మీర్‌లో వర్షాలు ఆగకుండా కురవడంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజల రక్షణ కోసం భద్రతా బలగాలు, అధికారులు సహాయక చర్యల్లో బిజీగా ఉన్న వేళ… ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వారిని అడ్డుకుని చొరబాటును విఫలం చేసింది. అధికారుల సమాచారం ప్రకారం, ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి నౌషెహ్రా నార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇంకా దాగి ఉన్నవారు ఉన్నారేమోనన్న అనుమానంతో ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆగస్టు ప్రారంభంలో జరిగిన “ఆపరేషన్ అఖల్” కింద ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టగా, ఒక సైనికుడు గాయపడ్డాడు. మొత్తం ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఈ చొరబాటు ప్రయత్నం చేసినవారు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా గుర్తించారు. ఇదే సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దాడిలో 26 మంది మరణానికి కారణమైందని అధికారులు గుర్తుచేశారు. వరదల విపత్తుతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఉగ్రవాదులు దురుద్దేశపూర్వకంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించడం గమనార్హం. అయితే సైన్యం క్షణక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, దేశ భద్రతను కాపాడుతోంది.