వైసీపీ పునాదులను మరింత బలపరిచే బాధ్యత జిల్లా ప్రధాన కార్యదర్శులదే అని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సజ్జల మాట్లాడుతూ, “జిల్లా ప్రధాన కార్యదర్శులు అంటే పార్టీకి కమాండర్లు. మీకు ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడాలి. వైఎస్సార్‌సీపీ ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మండల స్థాయి నుంచి బలమైన నాయకత్వం ఉంటేనే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు” అని అన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడాలని, ప్రభుత్వాన్ని నిలదీయడంలోనూ, ప్రజల గొంతుకగా పార్టీని నిలబెట్టడంలోనూ ప్రధాన కార్యదర్శులు కీలకంగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.