భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్‌కు పర్యాయపదంగా మారిన రజినీకాంత్ తన సినీ ప్రయాణంలో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి, బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేసిన రజినీకాంత్, కష్టపడి సినిమా రంగంలోకి ప్రవేశించి అపారమైన ఖ్యాతి సంపాదించారు. తనదైన స్టైల్, మాస్ అప్పీల్‌తో పాటు హాస్యం, యాక్షన్, సీరియస్ పాత్రలలోనూ నటనలో మెప్పించిన ఆయన తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ఈ ఐదు దశాబ్దాల ప్రయాణంలో ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, సరళమైన వ్యక్తిత్వంతో అందరికీ ప్రేరణగా నిలిచారు. రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతూ, రజినీకాంత్ నటన తరతరాల ప్రేక్షకులను అలరించిందని, ఆయన ఆరోగ్యం, ఆనందంతో దీర్ఘాయుష్షుతో మరిన్ని విజయాలు పొందాలని ఆకాంక్షించారు.