స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన జయశంకర్ సార్ త్యాగస్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిదని సీఎం గుర్తుచేశారు. అలాగే, తన పాట, ఆటతో సమాజాన్ని చైతన్యపరిచిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) వర్ధంతి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. గద్దర్ విప్లవ గీతాలతో, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటంతో ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజా ఉద్యమాల్లో అజరామరులైన ఈ మహనీయులిద్దరి సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.