అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవలే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అనేక ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఈ సుంకాలను మరింత పెంచుతానని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు భారత్ చేసిన చమురు కొనుగోళ్లు భారీ ఆర్థిక వనరులను అందిస్తున్నాయని, దాంతోనే యుద్ధం ఆగడం లేదని ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఇప్పటికే పలు సార్లు భారత్‌ను రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు తగ్గించమని కోరినా, భారత్ తన అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు కొనసాగిస్తోందని విమర్శించారు. “భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే… మేము సైలెంట్‌గా ఉండబోం. మరింత సుంకాలు విధించడానికి వెనకాడం. రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సిన డబ్బు భారత్ చెల్లిస్తే, ఆ బాధ్యతను మేము భరించలేం” అని ట్రంప్ హెచ్చరించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ ఇప్పటివరకు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఎనర్జీ భద్రత కోసం తక్కువ ధరకు లభించే ముడి చమురును కొనుగోలు చేయడం తప్పు కాదని, భారత్ అవసరాలను తీర్చుకోవడమే ప్రధాన లక్ష్యమని, ఎవరైనా దేశం నుంచి సరసమైన ధరకు వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడమేనని, భారత ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది.