ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు అవమానించడం తగదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి మేరకు పని చేస్తూనే ఉందన్నారు. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడం తప్ప ఏమీ కాదని విమర్శించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాజగోపాల్‌రెడ్డి స్పందించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇటీవల పత్రికా ప్రతినిధులతో మాట్లాడే సమయంలో “కొంతమంది సోషల్ మీడియా పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారు, వారిని మీడియా ప్రతినిధులుగా పరిగణించలేం” అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు, విమర్శలు వ్యక్తం అయ్యాయి. సీఎం ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే కోమటిరెడ్డి స్పందించారని పలువురు చర్చించుకుంటున్నారు.