కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన “రాజ్యాంగ సవాళ్లు” అనే సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్‌తో తన అనుబంధం, పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తెచ్చిన తన కృషిని వివరించే ప్రయత్నం చేశారు. 2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని వదులుకోవడాన్ని శివకుమార్ విశేషంగా ప్రశంసించారు. “ఆ సమయంలో రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయమని అడిగినా, సోనియా గాంధీ అధికారం కోసం కాదు అని చెప్పి, దేశాన్ని నడిపించగలగేవారని నమ్మి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా నిలబెట్టారు. ఇది రాజకీయంగా అసమానమైన త్యాగం,” అని వ్యాఖ్యానించారు. ఈ తరహా త్యాగం నేటి రాజకీయాల్లో ఎవరూ చేయరని శివకుమార్ గద్దించారు. “చిన్న చిన్న పదవుల విషయంలో కూడా ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. పంచాయతీ స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు చాలామంది అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు,” అని ఆయన అన్నారు.