వైసీపీ అధినేత వైయస్ జగన్ నెల్లూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పర్యటన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు నా గుండెల్లో ఉన్న ప్రదేశం అని, మీ ప్రేమే నాకు శక్తి అంటూ ప్రజలతో వ్యాఖ్యానించారు. ప్రజల కోసం తాను నడిచిన ప్రతి అడుగు, పోరాడిన ప్రతి క్షణం చిరకాలంగా గుర్తుండిపోతుందన్నారు. “మా నాయకులు, మా కార్యకర్తలపై దాడులు జరిగినా – మనం వెనక్కి తగ్గం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో కలిసే హక్కు ఎవరూ లాక్కోలేరు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు ఇవన్నీ ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజలతో కలిసేందుకు, వారి సమస్యలు వినేందుకు నాకు అడ్డుకట్ట వేయడం తప్పు. ఈ పోరాటం కేవలం నా కోసమో, వైసీపీ కోసమో కాదు… ఇది ప్రజల కోసమే.రైతు, కూలీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ – ప్రతి వర్గం కోసం మనం పనిచేస్తున్నాం. నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి చేరాయి, అందుకే ప్రజలు మనతో ఉన్నారు. చంద్రబాబు పాలనలో పేదలు ఎంత నష్టపోయారో మీరే చూసారు. అయినా మనం మాట నిలబెట్టుకున్నాం – పేదల కోసం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ప్రజల మద్దతు ఉంటే ఏ అడ్డంకీ మనపై గెలవదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులపై కేసులు పెట్టడం రాజకీయ కక్ష తప్ప మరేమీ కాదు. ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబం, ప్రతి కార్యకర్త వెన్నంటే ఉండటం మన బలం. మనం ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఓడించలేరు.వైయస్ఆర్ ఇచ్చిన నమ్మకాన్ని నేను ఎప్పటికీ ద్రోహం చేయను. ప్రజల కోసం చేసిన పని ఎప్పటికీ వృథా కాదు, చరిత్రలో నిలుస్తుంది.నాకు అధికారం కోసం ఆశ లేదు, కానీ ప్రజల కోసం త్యాగం చేయడానికి సిద్ధం. మన లక్ష్యం స్పష్టంగా ఉంది.. పేదల సంక్షేమమే మన రాజకీయం. ప్రజల ఆశీర్వాదం మనకు ఉన్నంతకాలం వైసీపీ జెండా ఎగురుతూనే ఉంటుంది.” అని జగన్ వ్యాఖ్యానించారు.