Saturday, August 30, 2025

రష్యాలో భూకంపం.. జ‌పాన్‌లో సునామీ

Must Read

రష్యా తూర్పు తీర ప్రాంతం కమ్చాట్కాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 8.7–8.8 తీవ్రత నమోదైంది. ఈ భూకంపంతో 1952 తర్వాత‌ అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు సంభ‌వించిన‌ట్లు గుర్తించారు. దీని కేంద్ర బిందువు పెట్రోపావ్లోవ్‌స్క్‌ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భూకంప నిపుణులు వెల్లడించారు. ఈ ప్రకంపనల ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో సునామీ అలలు పుట్టుకొచ్చి జపాన్‌ తీరప్రాంతాలను ఢీకొన్నాయి.

జపాన్ తీర ప్రాంతాల‌లో ఉద్రిక్త‌త‌…
సునామీ ప్రభావంతో హొక్కైడో నుంచి చింబా వరకు అలలు నమోదయ్యాయి. మియాగి ప్రిఫెక్చర్‌లోని ఇషినమాకి పోర్ట్ వద్ద గరిష్టంగా 50 సెంటీమీటర్ల ఎత్తైన అలలు తాకాయి. చింబా తీరానికి నాలుగు తిమింగలాలు కొట్టుకొచ్చిన ఘటన కలకలం రేపింది. తీరప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేస్తూ ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. సునామీ అలజడి కారణంగా రవాణా, ట్రావెల్ సౌకర్యాల్లో అంతరాయం ఏర్పడింది.
తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్‌ ఎయిర్‌ పోర్టులు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈశాన్య జపాన్‌లోని సెండాయ్‌ విమానాశ్రయాన్ని మూసివేశారు.

ర‌ష్యాలో భ‌యాందోళ‌న‌లు…
కమ్చాట్కా ప్రాంతంలోని పలు పట్టణాలు తీవ్ర ప్రకంపనలతో వణికాయి. కొన్ని తీర గ్రామాల్లో భవనాలు, విద్యాసంస్థలు దెబ్బతిన్నాయి. కొందరు గాయపడినప్పటికీ పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. భూకంపం తర్వాత వరుసగా ఆఫ్టర్‌షాక్స్ నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

అప్ర‌మ‌త్త‌మైన దేశాలు..
జపాన్‌ వాతావరణ విభాగం 9 లక్షల మందికి పైగా తీరప్రాంత ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఫుకుషిమా డైచీ అణు విద్యుత్ ప్లాంట్ సిబ్బందిలో కొంతమందిని ముందస్తు చర్యగా తరలించారు. రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ ప్రజలు సముద్రానికి దూరంగా ఉండాలని సూచించింది.అమెరికాలోని హవాయి ద్వీపంలో అప్రమత్తత ప్రకటించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. భూకంపం తీవ్రత కారణంగా వరుసగా ప్ర‌కంప‌న‌లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జపాన్‌లో రవాణా వ్యవస్థలు నిలిచిపోవ‌డంతో తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిపుణులు ఆఫ్టర్‌షాక్స్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు భారీ ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగిస్తోంది. జపాన్‌ తీరంలో, 2011 మార్చిలో 9.0 తీవ్రతతో వచ్చిన గ్రేట్‌ తోహోకు భూకంపం తర్వాత ప్రపంచంలో ఇంతటి శక్తివంతమైన భూకంపం సంభవించ‌డం ఇదే తొలిసారి. ఆ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల ఎత్తు వరకు ఎగిసాయి. ఈ విపత్తులో దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 2,500 మంది ఆచూకీ లేకుండా పోయారు. దీంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్ తీరప్రాంతాలు అప్రమత్తం అయ్యాయి.

భారత్‌కి సేఫ్‌..
భూకంపం తర్వాత భారత్‌కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఇన్‌కాయిస్‌ స్పష్టతనిచ్చింది. భారత్‌కు, హిందూ మహాసముద్ర తీరప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్‌ లో అధికారిక ప్రకటన చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -