వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఊరట లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలిపివేస్తూ ట్రైబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్ జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైయస్ షర్మిలపై ఆరోపణలు చేస్తూ, షేర్లను తమ అనుమతి లేకుండా అక్రమంగా బదిలీ చేసుకున్నారని పేర్కొంటూ 2024 సెప్టెంబర్‌లో ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. తనతో పాటు భార్య వైయస్ భారతి పేర్లలో ఉన్న షేర్లను సంతకాలు లేకుండా బదిలీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో తెలిపారు. కంపెనీ యాక్ట్ 59 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో విజయమ్మ, షర్మిలతో పాటు సండూర్ పవర్ లిమిటెడ్, జనార్థన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. సుమారు 10 నెలలుగా అన్ని పక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్, ఈ నెల 15న తీర్పును రిజర్వు చేసి, ఈ రోజు జగన్ పక్షాన నిర్ణయం వెలువరించింది. సీబీఐ, ఈడీ విచారణలో ఉన్న కేసులు ముగియకముందు షేర్ల బదిలీ జరగదని స్పష్టం చేస్తూ, బదిలీని తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తానికి, సరస్వతీ పవర్ షేర్ల బదిలీ అక్రమమని తేల్చిన ఎన్సీఎల్టీ, షర్మిల, విజయమ్మకు భారీ షాక్ ఇస్తూ, జగన్‌కు పెద్ద ఊరట కల్పించింది.