తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్, జటప్రోలు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి , ప్రస్తుత పాలన లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజా సభలో వివరించారు. “తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుగా రావొద్దు. సహకరించండి. వినకపోతే పోరాడతాం. ఆ పోరాటానికి నాయకత్వం వహించేందుకు సిద్ధం,” అని సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి ప్రాణశక్తిగా అభివర్ణిస్తూ, వీటిని అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో పాలమూరును దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జటప్రోలులో ప్రతిపాదిత “యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్” నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆలయ దర్శనం అనంతరం జరిగిన “ప్రజా పాలన – ప్రగతిబాట” బహిరంగ సభలో పలు అంశాలపై మాట్లాడారు.
భూ సేకరణ, నష్ట పరిహారం…
ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణను డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి రైతులకు నష్ట పరిహారం అందిస్తామన్నారు.
ఉద్యోగ నియామకాలు:
ఇప్పటివరకు 60,000 ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రాబోయే రెండున్నరేళ్లలో మరో 40,000 ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఉద్యోగాల టార్గెట్‌ను చేరుతుందని తెలిపారు.
మహిళా సంక్షేమం
18 నెలల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వం, 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా కోటి మంది మహిళలను ఆర్థికంగా స్థిరంగా నిలబెట్టే సంకల్పాన్ని ప్రకటించింది.
పెట్టుబడులు…
విదేశీ పర్యటనల ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు సీఎం పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.344 కోట్ల చెక్కులను, బ్యాంకు లింకేజీ, ప్రమాద బీమా, రేషన్ కార్డులను సీఎం అందజేశారు. అంతేకాక, కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తిపై, జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహను సీఎం ఆదేశించారు.