వీధికుక్కలకు రోడ్లపై ఆహారం పెట్టడంపై చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధికుక్కలపై ప్రేమ ఉంటే వారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టొచ్చు కదా? అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీధికుక్కలకు ఆహారం పెట్టే సమయంలో స్థానికులు వేధిస్తున్నారని నోయిడాకు చెందిన వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అంతకుముందు అలహాబాద్ హైకోర్టు కూడా ఇదే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వీధికుక్కలు వాకింగ్ చేస్తున్న వారిపై, వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయని హైకోర్టు పేర్కొంది. వీధిలో కాకుండా, ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక పిటిషనర్‌కు నిజంగా కుక్కలపై ప్రేమ ఉంటే తన ఇంట్లోనే వాటికి షెల్టర్ ఏర్పాటు చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా అదే తత్వాన్ని కొనసాగించింది. వీధికుక్కల వల్ల ప్రాణాపాయం ఏర్పడుతోందని విచారించిన ధర్మాసనం — ‘‘ప్రేమ ఉంటే ఇంటికే తీసుకెళ్లి పెంచండి. అందరికీ అసౌకర్యం కలిగించేలా వీధుల్లో భోజనం పెట్టొద్దు’’ అంటూ స్పష్టం చేసింది.