కర్ణాటకలో ఇటీవల ఒకే జిల్లాలో గుండెపోటుతో పలువురు చనిపోవడానికి కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో 40 రోజుల్లో గుండెపోటుతో 23 మంది యువకులు మృతి చెందారు. అందరూ 19 నుండి 25 ఏండ్ల లోపు యువకులు కావడంతో.. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి ఏమైనా సంబంధం ఉందా అని అధికారులను సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. దీంతో మరణాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.సీఎం సిద్ధరామయ్య చేసిన ఆరోపణలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని, ఇతర సమస్యల కారణంగా ఆకస్మికంగా గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది.