మహారాష్ట్రలోని పూణేలో అరుదైన వ్యాధి కలకలం రేపుతోంది. గులియన్ బారే సిండ్రోమ్ అనే నాడీ సంబంధిత వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక్క పూణేలోనే దాదాపు 73 మంది ఈ ప్రమాదకరమైన మెదడు వ్యాధి బారిన పడ్డారని సమాచారం. వీరిలో 47 మంది పురుషులు, 26 మంది స్త్రీలు ఉన్నారు. 14 మందిని వెంటిలేటర్లపై ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారులు శుక్రవారం తెలిపారు.
గులియన్ బారే సిండ్రోమ్ కండరాల కదలికను నియంత్రించే నరాలను ప్రభావితం చేస్తుంది. ఇది కండరాల బలహీనత, కాళ్లు ,లేదా చేతుల్లో సంచలనాన్ని కోల్పోయేలా చేస్తుంది. మింగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారి తీస్తుందని చెబుతున్నారు. ఇది సాధారణంగా సంక్రమణ తర్వాత అభివృద్ధి చెందుతుందని వివరించారు. అయితే, ఈ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నాయని తెలిసింది. కానీ, ఒకేసారి పూణెలో కేసుల సంఖ్య పెరగడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.