వైకుంఠ ఏకాదశి పర్వదిన టోకెన్ల జారీ సమయంలో జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు టీటీడీ పరిహారం ప్రకటించింది. గాయపడిన బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో తిరుమలలో జనవరి 13కు సంబంధించిన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపై టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముక్కోటి ఏకాదశితో పాటు తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్లు బుధవారం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రేపటి (సోమవారం) నుంచి ఏ రోజుకారోజు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ అధికారులు మొదటగా ప్రకటించారు. అయితే శనివారం రాత్రికే తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తోపులాట వంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు జారీ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో కేంద్రాల వద్ద గుమిగూడితే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. దీంతో 13వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గల వివిధ ప్లాట్ల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను శనివారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభించారు.