తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 31లోగా 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకు వెళ్లే వారు తప్పక సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజాభవన్‌లో నిర్వహించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కార్యక్రమంలో సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు సీఎ రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. బిహార్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామని.. ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు.