రొమ్ము క్యాన్సర్ అనగానే మహిళలకు మాత్రమే వస్తుందని చాలా మందిలో ఓ అపోహ ఉంది. కానీ మగవారికి కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. దీన్ని మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. అగ్రరాజ్యం అమెరికాలో బయటపడిన ప్రతి వంద క్యాన్సర్ కేసుల్లో ఒకటి మేల్ బ్రెస్ట్ క్యాన్సరేనని తేలింది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో దీని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే రొమ్ము క్యాన్సర్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
వయసు మీదపడిన మగవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ (సీడీసీ) తెలిపింది. చాలా మటుకు బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 50 ఏళ్లు పైబడిన వారిలోనే గుర్తించామని పేర్కొంది. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ సింప్టమ్స్ ను గుర్తించేందుకు తరచూ బ్రెస్ట్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం బెటర్ అని సూచించింది.
లివర్ సమస్య ఉందా?
కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే మగవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని సీడీసీ పేర్కొంది. లివర్ దెబ్బతింటే ఆండ్రోజెన్ స్థాయులు తగ్గుతాయి. అదే టైమ్ లో ఈస్ట్రోజన్ స్థాయులు పెరుగుతాయి. దీని వల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువవుతుంది. మగవారిలో రొమ్ము క్యాన్సర్ ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ఏసీఎస్) ప్రకారం.. మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ లో పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి రొమ్ము లోపల వాపు. ఆ వాపును నొక్కితే చేతికి గట్టిగా తగులుతుంది. కానీ అక్కడ నొప్పి ఉండదు.
వారికి ముప్పు ఎక్కువే!
మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ లో మరికొన్ని లక్షణాలను ఇప్పుడు చూద్దాం.. చనుమొనల నుంచి రక్తం కారుతుంది. ఆ ప్రాంతంలో నొప్పి వస్తుంది. రొమ్ముతో పాటు చనుమొనల ప్రాంతంలో చర్మం రంగు మారుతుంది. అక్కడ దద్దుర్లు కూడా వస్తాయి. జీన్స్ మ్యూటేషన్ వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే.. రొమ్ము క్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ట్రీట్‌మెంట్
చంకలోని శోషరస కణుపుల్లో వాపు, నొప్పి, ఎముకల నొప్పి ఉంటే క్యాన్సర్ తీవ్రమైనదిగా గ్రహించాలని నిపుణులు అంటున్నారు. చనుమొనల నుంచి స్రావాలు, రక్తం కారినా అది క్యాన్సరేనని చెబుతున్నారు. ట్యూమర్ పరిమాణాన్ని బట్టి వైద్యులు చికిత్సను సూచించే అవకాశం ఉంది. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ లాంటివి బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేయడానికి అందుబాటులో ఉన్న కొన్ని పద్ధతులుగా చెప్పొచ్చు.