ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్లది ఓ స్పెషల్ సెగ్మెంట్. ఇందులో పోటీ ఎక్కువే ఉన్న బ్రాండ్లు మాత్రం చాలా తక్కువ. లంబోర్గినీ, జాగ్వార్, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, ఫెరారీ, రోల్స్ రాయిస్, బుగాటీ, టెస్లా, వోల్వో, లెక్సస్, ఆడీ, ల్యాండ్ రోవర్ లాంటివి ఈ కేటగిరీలోకే వస్తాయి. మీడియం, లోవర్ రేంజ్ కారు బ్రాండ్లతో పోల్చుకుంటే లగ్జరీ కేటగిరీలో ఉన్న కంపెనీలు తక్కువేనని చెప్పాలి. కానీ వీటి మధ్య పోటీ మాత్రం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఈ కార్లన్నీ దాదాపు రూ.30 లక్షల రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి.
బెస్ట్ బ్రాండ్
ప్రపంచ దేశాల్లో బాగా పేరుపొందిన లగ్జరీ కార్ల బ్రాండ్ గా మెర్సిడెజ్ బెంజ్ ను చెప్పొచ్చు. ఈ కంపెనీ కార్లకు ఉండే గిరాకీ మామూలు కాదు. సెలబ్రిటీలు, వీఐపీలు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లలో బెంజ్ ముందు వరుసలో ఉంటుంది. ఈ కారును చాలా మంది స్టేటస్ సింబల్ గా భావిస్తారు. జర్మనీకి చెందిన మెర్సిడెజ్ బ్రాండ్ కూడా కస్టమర్ల టేస్ట్ కు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటోంది. సరికొత్త ఫీచర్లతో ట్రెండ్ కు తగ్గట్లుగా కార్లను తయారు చేయడంపై దృష్టి పెడుతోంది.
ఈవీలపై ఫోకస్
మిగతా కంపెనీల్లాగే మెర్సిడెజ్ బెంజ్ కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్ రూపొందించడం మీద పనిచేస్తోంది. ఈ క్రమంలో మెర్సిడెస్ బెంజ్ తీసుకొస్తున్న నయా మోడల్ ‘విజన్ మెర్సిడెజ్-మేబ్యాచ్ 6’. ఆ సంస్థ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఇదొకటి. ఇప్పటికే పలు దేశాల్లో దీన్ని ప్రదర్శించింది మెర్సిడెజ్. అయితే అక్టోబర్ 16వ తేదీన మొట్టమొదటిసారి ఈ కారును ఇండియాలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
స్టైలిష్ డిజైన్
విజన్ మెర్సిడెజ్-మేబ్యాచ్ 6 కారు మోడల్ పవర్ విషయంలో మిగతా లగ్జరీ కార్లకు మించి ఉంటుందని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ 738 బీహెచ్పీ పవర్ ఔట్ పుట్ ను ఈ కారు ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే విజన్ మెర్సిడెజ్ కారు ఏకంగా 321 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్ గా దూసుకెళ్లగలదు. అది దీని ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పొచ్చు.
రెడ్ లుక్ లో అల్ట్రా స్టైలిష్ గా మెర్సిడెజ్ మేబ్యాచ్-6 కారును డిజైన్ చేశారు. లుక్స్, స్టైల్, ఫీచర్స్, కంఫర్ట్.. ఇలా అన్ని రకాలుగా బెస్ట్ గా చెప్పుకునే ఈ కారు ప్రొడక్షన్ ఇంకా మొదలవ్వలేదని సమాచారం. ప్రపంచం మొత్తం ఈ కారు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి.. మెర్సిడెజ్ సంస్థ ఈ కారు ఉత్పత్తిని ఎప్పుడు మొదలుపెడుతుందో? మార్కెట్ లోకి ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుందో చూడాలి.