ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి ఊబకాయం. అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల తలెత్తే సమస్యల్లో ఇదొకటి. అధిక బరువు వల్ల ఏ పని సరిగ్గా చేయలేరు. ఈ మధ్య కాలంలో వృద్ధులతో పాటు యువకులు, మధ్య వయస్కుల్లోనూ ఊబకాయం కనిపిస్తోంది. పిల్లల్నీ ఇది వదలడం లేదు. అధిక బరువుతో బాధపడేవారు తరచూ వ్యాయామం చేయడంతో పాటు ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ తీసుకునే పుడ్ లో పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలను చేర్చుకోవడం మంచిది. అయితే రెగ్యులర్ గా తీసుకునే గోధుమ, పూరీ పిండి లాంటి వాటి కంటే ఇతర సంప్రదాయ పిండితో చేసిన రొట్టెలు తీసుకోవడం మంచిదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. మార్కెట్ లో అందుబాటులో ఉన్న పలు రకాల పిండి పదార్థాలను దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. మరి.. బరువు తగ్గేందుకు ఎలాంటి పిండితో చేసిన వంటకాలు తినాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
క్వినోవా
క్వినోవాలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. ఇందులో ఫోలేట్, మెగ్నీషియంతో పాటు జింక్, ఐరన్ లాంటి న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి. క్వినోవాలో ఫైబర్ కంటెంట్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. క్వినోవా పిండితో చేసిన వంటకాలను తరచూ తీసుకుంటే మీ కడుపు త్వరగా నిండుతుంది. దీని వల్ల మీరు అతిగా తినలేరు. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
జొన్నలు
చిరుధాన్యాల్లో ఒకటైన జొన్నల్లో చాలా రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన హెల్త్ ను కాపాడటమే కాకుండా బరువు తగ్గేందుకూ సాయపడతాయి. బరువు తగ్గాలనుకుంటే గోధుమలతో చేసిన రొట్టెలకు బదులుగా జొన్న రొట్టెల్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువును తగ్గించడంతో పాటు డయాబెటిస్ ను కంట్రోల్ చేసేందుకూ ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. న్యూట్రియన్స్ అధికంగా ఉండే జొన్నలు మన జీర్ణక్రియకు కూడా ఇతోధికంగా మేలు చేస్తాయి.
ఓట్స్
మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఆహార పదార్థాల్లో ఓట్స్ కూడా ఒకటి. ఇందులో మినరల్స్, విటమిన్స్ తో పాటు ఫైబర్ లాంటి ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా రోజువారీ తీసుకునే ఆహారంలో ఓట్స్ పిండితో చేసిన రొట్టెలను తినాలని హెల్త్ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. మధుమేహంతో బాధపడేవారికి కూడా ఓట్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
అమర్ నాథ్ ఫుడ్
అమర్ నాథ్ ఫుడ్ గురించి తక్కువ మందికే తెలుసు. వందల ఏళ్లుగా వాడుతున్న పోషకాహారమిది. చిన్న సైజులో ఉండే ఈ గింజల్లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్ని కాసేపు వేపుకొని, పార్ కార్న్ లా చేసుకొని తినొచ్చు. వీటిని ఉడకబెట్టి కూడా తినొచ్చు. అలాగే ఇతర పుడ్స్ తో కలిపి కూడా తీసుకోవచ్చు. ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అమర్ నాథ్ లో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ గింజల వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ గింజలు ఎంతగానో మేలుచేస్తాయి.
కొబ్బరి
గోధుమ, పూరీ పిండికి కొబ్బరి పిండి మంచి ప్రత్యామ్నాయమని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇందులో మెండుగా ఉండే ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సేపు చురుగ్గా ఉంచుతుంది. అలాగే మీ ఎనర్జీ లెవల్స్ పడిపోకుండా చూసుకుంటుంది. కొబ్బరి పిండితో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఎండు కొబ్బరితో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.