Weight loss: అన్నం తింటే బరువు తగ్గడం కష్టమా? ఇందులో నిజమెంత?
ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ తినడానికి కూడా సరిగ్గా టైమ్ ఉండట్లేదు. అందుకే ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడ్డారు. ఏ అర్ధరాత్రో పడుకోవడం, ఫోన్లకు అతుక్కుపోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటి దురలవాట్ల వల్ల కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారు. ఇక, ఊబకాయుల సంఖ్య అయితే ఏటికేడు పెరుగుతోంది. అయితే కొందరు మాత్రం అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తారు. ఎంత ప్రయత్నించినా తగ్గరు. వారిలో కొందరు అన్నం తింటే బరువు తగ్గమేమోనని తినడం మానేస్తారు. అలాంటి వాళ్ల కోసం అసలు నిజాలు ఇవే..
బరువు పెరగడానికి బియ్యంతో సంబంధం లేదని ఫేమస్ ఫిట్‌నెస్ కోచ్ మిటెన్ కాకాయియా అన్నారు. అన్నం మనల్ని లావుగా చేయదని మిటెన్ కాకాయియా చెప్పారు. బరువు తగ్గడానికి సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని మిటెన్ తెలిపారు. ఫిట్‌నెస్ టార్గెట్‌ను చేరుకునేందుకు అన్నం మానేయడం సరికాదన్నారు.
అతిగా తినడమే.. బరువు పెరగడానికి ప్రధాన కారణమని మిటెన్ పేర్కొన్నారు. ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. బరువు పెరగడానికి.. ఇది ఏకైక కారణం కానప్పటికీ, ప్రధాన పాత్ర మాత్రం దీనిదేనని వ్యాఖ్యానించారు.
అతిగా తినొద్దు
అన్నల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించిన ఒక రీసెర్చ్ ప్రకారం కేలరీలు తక్కువగా తీసుకుంటే.. బరువు తగ్గడానికి సాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు.. రోజూ అవసరమైన దానికంటే కొంచెం తక్కువగా కేలరీలు తీసుకోవాలని ఫిట్నెస్ కోచ్ మిటెన్ సూచించారు. క్యాలరీలు తగ్గిస్తే బరువు తగ్గడానికి దోహదపడుతుందని మిటెన్ పేర్కొన్నారు.
వ్యాయామం తప్పనిసరి
బరువు తగ్గాలనుకునేవారు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సాధ్యమైనంతగా శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ప్రయత్నించాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక రోగాలు దూరం అవుతాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, హెల్తీ వెయిట్ మెయింటేన్ చేయాలనుకునే వారు.. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి.
మీ డైట్లో వీటిని చేర్చండి..
బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి బాడీకి కావాల్సినర పోషకాలను అందిస్తాయి.
వీటికి దూరంగా ఉండాలి
ఎక్కువ క్యాలరీలు, కొవ్వులతో నిండి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు డయాబెటిస్, రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. బరువు తగ్గాలనుకునే వారు సాఫ్ట్డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, క్యాండీస్, బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్‌కు చాలా దూరంగా ఉండాలి. పేస్ట్రీలు, కేక్స్, కుకీస్.. లాంటి బేకరీ పదార్థాల్లో చక్కెరలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను బాగా పెంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువూ పెరుగుతాం. కాబట్టి పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.