వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం.. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు?
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల దేశ రాజధాని మీద దృష్టి సారించారు. గత కొన్నాళ్లుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న ఆమె.. ఇప్పుడు హస్తిన గడప తొక్కనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న షర్మిల.. దీని మీద కేంద్ర సర్కారు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 2జీ స్పెక్ర్టమ్, కోల్ స్కాం కంటే కూడా కాళేశ్వరం నిర్మాణం అతిపెద్ద స్కామ్ అని షర్మిల ఆరోపించారు. కాళేశ్వరంపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 14వ తేదీన ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ ర్యాలీగా వెళ్లాలని తమ పార్టీ నిర్ణయించిందని షర్మిల చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారని షర్మిల ఆరోపించారు. ఇది అవసరం లేని ప్రాజెక్ట్ అని ఆమె పేర్కొన్నారు. ‘ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు ఖర్చును మూడింతలు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదంటారా? విచారణ జరగొద్దంటారా? కనీసం ఆ ప్రాజెక్టులో నాణ్యత అయినా ఉందా?’ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మాణం అనేది ఒక అట్టర్ ప్లాప్ అయిన ప్రాజెక్టు అని ఆమె దుయ్యబట్టారు.