బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!
శరీరంలో కాల్షియం లోపం ఉన్నవారికి వచ్చే వ్యాధుల్లో ‘బోలు ఎముకల వ్యాధి’ ఒకటి. దీన్ని నయం కాని వ్యాధిగా చెబుతుంటారు. కానీ దీని లక్షణాలను మాత్రం అదుపులో ఉంచడం సాధ్యమే. ఆహారపు అలవాట్లు, జీవనశైలికి సంబంధించిన సమస్యగా దీన్ని చెప్పొచ్చు. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి.. ఈమధ్య మహిళల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. నడివయస్కులైన స్త్రీలలో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోందట. మరి, దీని నుంచి బయటపడేందుకు ఏమేం చేయాలో తెలుసుకుందాం..
బోలు ఎముకల వ్యాధి వల్ల ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఈ వ్యాధిలో కొత్త ఎముక కణజాలాల నిర్మాణం ఆగిపోతుంది. వాటి వేగం కూడా మునుపటి కంటే తగ్గుతుంది. శరీరంలో కాల్షియం లోపం ఉన్న వారికి ఈ వ్యాధి సులభంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. స్రీ, పురుషులిద్దరికీ ఈ వ్యాధి రావొచ్చు. అయితే దీంతో బాధపడుతున్న వారిలో మహిళల సంఖ్యే ఎక్కువని నివేదికల్లో తేలింది. 50 ఏళ్లు పైబడిన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారని స్పష్టమైంది. మెనోపాజ్ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల మహిళలు ఈ వ్యాధి బారిన అధికంగా పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలను తగ్గించుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
- బోలు ఎముకల వ్యాధితో బాధపడే వారు ఎక్కువగా కాల్షియంను తీసుకోవాలి. అందుకు పాలు, పెరుగు లాంటి కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను భోజనంలో భాగం చేసుకోవాలి.
- ఆకుకూరలను బాగా తినాలి. ముఖ్యంగా బచ్చిలికూరను వారానికి రెండుసార్లు అయినా తినాలి. తృణధాన్యాలను కూడా తింటూ ఉండాలి.
- శరీరంలో విటమిన్ డీ లెవల్స్ పడిపోకుండా చూడాలి. శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే నారింజ పండ్లను తింటూ ఉండాలి.
- ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
- శరీరానికి హానికలిగించే యాంటాసిడ్స్, థెరాక్సిన్ సప్లిమెంట్లు, స్టెరాయిడ్స్ను అస్సలు తీసుకోవద్దు.
- తరచూ వ్యాయామం చేయాలి. ఏరోబిక్స్ చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. వేగంగా నడవడం కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. దీన్ని వారంలో ఐదు రోజులు చేయాలి.
- ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.